YouVersion Logo
Search Icon

2 కొరింథీయులకు 12

12
1అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసివచ్చినది. ప్రభువు దర్శనములనుగూర్చియు ప్రత్యక్షతలనుగూర్చియు చెప్పుదును. 2క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపో బడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 3-4అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 5అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను. 6అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచినదానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. 7నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒకముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. 8అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 9అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము,#12:9 లేక, నన్ను కప్పునిమిత్తము. 2 మూలభాషలో–వెదకుచున్నాను. విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. 10నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.
11నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను. 12సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీమధ్యను నిజముగా కనుపరచబడెను. 13నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి.
14ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను.2 పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా 15కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? 16అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేతపట్టుకొంటిని అని చెప్పుదురేమో. 17నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? 18మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా?
19మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము. 20-21ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టు డనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులునుఉండు నేమో అనియు, నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు,మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులనుగూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 2 కొరింథీయులకు 12