2 దినవృత్తాంతములు 34
34
1యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరములు ఏలెను. 2అతడు యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండ తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. 3తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను. 4అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి, వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి. 5బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను. 6ఆప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును, చుట్టుపెట్లనున్న పాడుస్థలములన్నిటను బలిపీఠములను పడ గొట్టెను. 7బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కినవిగ్రహములను చూర్ణముచేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
8అతని యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున, దేశమును మందిరమును పవిత్రపరచుటయైన తరువాత, అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతియైన మయశేయాను, రాజ్యపు దస్తావేజులమీదనున్న యోవాహాజు కుమారుడగు యోవాహును, తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను. 9వారు ప్రధానయాజకుడైన హిల్కీయాయొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశములయందు ఇశ్రాయేలువారిలో శేషించియున్న వారందరియొద్దనుండియు, యూదా బెన్యామీనీయులందరి యొద్దనుండియుకూర్చి, దేవుని మందిరములోనికి తీసికొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. 10వారు దానిని యెహోవా మందిరపు పనిమీదనున్న పైవిచారణకర్తల కియ్యగా, దాని బాగుచేయుటకును, యూదారాజులు పాడుచేసిన యిండ్లకు దూలములను అమర్చుటకును 11చెక్కిన రాళ్లను జోడింపుపనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయువారికిని శిల్పకారులకును దాని నిచ్చిరి. 12ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారిమీది పైవిచారణకర్తలు ఎవరనగా, మెరా రీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జెకర్యా మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్యప్రవీణులైనవారు వారితోకూడ ఉండిరి. 13మరియు బరువులు మోయు వారిమీదను, ప్రతివిధమైన పని జరిగించువారిమీదను ఆ లేవీయులు పైవిచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులును పరిచారకులును ద్వారపాలకులు నైనవారు ఆయా పనులమీద నియమింపబడిరి. 14యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగలగ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. 15అప్పుడు హిల్కీయా–యెహోవామందిరమందు ధర్మశాస్త్రముగలగ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. 16షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసికొనిపోయి రాజుతో ఇట్లనెను–నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. 17యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు. 18మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవిచేసికొని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానినుండి చదివి వినిపించెను. 19అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని 20హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను 21– మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించియున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.
22అప్పుడు హిల్కీయాయును రాజు నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయునగు షల్లూముయొక్క భార్యయైన హుల్దా అను ప్రవక్తియొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుప భాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా 23ఆమె వారితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా 24–ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను. 25వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నాకోపము ఈ స్థలముమీద మితిలేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. 26మరియు యెహోవాయొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి–నీవు ఎవనిమాటలు విని యున్నావో ఇశ్రాయేలీయులదేవుడైన ఆ యెహోవా సెలవిచ్చునదేమనగా 27–నీ మనస్సు మెత్తనిదై యీ స్థలముమీదను దాని కాపురస్థులమీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. 28నేను నీ పితరులయొద్ద నిన్ను చేర్చుదును; నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు; ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు.
29వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువనంపించి 30వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజకులును, లేవీయులును, జనులలో పిన్నపెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను. 31పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి –నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదు నని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను. 32మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరిని బెన్యామీనీయులనందిరిని అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను గనుక యెరూషలేము కాపురస్థులు తమపితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. 33మరియు యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోనుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి, ఇశ్రాయేలీయులందరును తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను. అతని దినములన్నియు వారు తమపితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.
Currently Selected:
2 దినవృత్తాంతములు 34: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.