2 దినవృత్తాంతములు 26
26
1అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. 2అతడు ఏలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను.
3ఉజ్జియా యేలనారంభించినప్పుడు పదునారేండ్లవాడై యెరూషలేములో ఏబది రెండు సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెకొల్యా. 4అతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 5దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను. 6అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. 7ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధముచేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. 8అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. 9మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. 10అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.
11యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయ శేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి. 12వారి పితరులయిండ్ల పెద్దల సంఖ్యనుబట్టి పరాక్రమశాలులు రెండువేల ఆరువందలమంది యైరి. 13రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరుపొందిన పరాక్రమశాలు లైన మూడులక్షల ఏడువేల ఐదువందలమందిగల సైన్యము వారి చేతిక్రింద ఉండెను. 14ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను. 15మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.
16అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహముచేయగా 17యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబదిమందియు అతని వెంబడి లోపలికి పోయిరి. 18వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి –ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా 19ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠముప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. 20ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను. 21రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియైయుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. 22ఉజ్జియా చేసిన యితర కార్యములనుగూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా వ్రాసెను. 23ఉజ్జియా తన పితరులతోకూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధమైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.
Currently Selected:
2 దినవృత్తాంతములు 26: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.