YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 12

12
1రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన . తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. 2వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను. 3అతనితోకూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి. 4అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా 5ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి–మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. 6అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. 7వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను. 8అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లువారు అతనికి దాసులగుదురు.
9ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరు లోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను. 10వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్క ద్వారమును కాయు సేవకులయొక్క అధిపతులకు అప్పగించెను. 11రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి. 12అతడు తన్నుతాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.
13రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి యేలుబడి చేసెను; రెహబాము ఏలనారంభించినప్పుడు నలుబదియొక సంవత్సరముల యీడుగల వాడై యుండెను; తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. 14అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.
15రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది. 16రెహ బామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదుపట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 2 దినవృత్తాంతములు 12