YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 1

1
1దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితోకూడ ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను. 2యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక 3సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరులయిండ్లకు పెద్దలైనవారికందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును 4సొలొమోనుతోకూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను. 5హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి. 6సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
7ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగు మని సెలవియ్యగా 8సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెను–నీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించియున్నావు గనుక 9దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైనజనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు 10ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. 11అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు ఈ ప్రకారము యోచించుకొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు. 12కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. 13పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను.
14సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమకూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. 15రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేలా ప్రదేశమున మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను. 16సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. 17వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in