YouVersion Logo
Search Icon

1 తిమోతికి 4

4
1అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును 2దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిపుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు. 4దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు; 5ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్రపరచబడుచున్నది.
6ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు. 7అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము. 8శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 9ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైయున్నది. 10మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.
11ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము. 12నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 13నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. 14పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. 15నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము. 16నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in