1 సమూయేలు 4
4
1ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. 2ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువతక్కువ నాలుగు వేలమంది హతులైరి. 3కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధనమందసమును మనము తీసికొని మన మధ్యనుంచుకొందము రండి; అది మన మధ్యనుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి. 4కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబులమధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధనమందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధనమందసమునొద్ద ఉండిరి. 5యెహోవా నిబంధనమందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్పకేకలు వేసిరి. 6ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధనమందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని 7జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని–అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు, 8అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. 9ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. 10ఫిలిష్తీయులు యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను. 11మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి. 12ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను. 13అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి. 14ఏలీ ఆ కేకలు విని–ఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. 15ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. 16ఆ మనుష్యుడు–యుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు–నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను. 17అందుకు అతడు–ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను 18దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారముదగ్గర నున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను; ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియైయుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. 19ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవునియొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులుతగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను. 20ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో–భయపడవద్దు, కుమారుని కంటివనిరిగాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై 21దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు#4:21 ప్రభావము పోయెను. అను పేరు పెట్టెను. 22దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.
Currently Selected:
1 సమూయేలు 4: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.