1 సమూయేలు 25
25
1సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు. కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్లెను.
2కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱెలును వెయ్యి మేకలును ఉండెను. అతడు–కర్మెలులో తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను. 3అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతివాడు. 4నాబాలు గొఱ్ఱెలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని 5తన పనివారిలో పదిమందిని పిలిచి వారితో ఇట్లనెను– మీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి 6ఆ భాగ్యవంతునితో–నీకును నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి యీ వర్తమానము తెలియజెప్పవలెను. 7–నీ యొద్ద గొఱ్ఱెలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱెకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు; 8నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. 9దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా 10నాబాలు– దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు. 11నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా 12దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకొనిపోయి అతనికి ఈ మాటలన్నియు తెలియజేసిరి. 13అంతట దావీదు వారితో–మీరందరు మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందలమంది సామాను దగ్గర నిలిచిరి. 14పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను–అమ్మా, దావీదు అరణ్యములోనుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. 15అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారిమధ్యను సంచరించుచున్నంత సేపు అపాయముగాని నష్టముగాని మాకు సంభవింపనేలేదు. 16మేము గొఱ్ఱెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి. 17అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించియున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను. 18అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి 19–మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి 20గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసికొనెను. 21అంతకుమునుపు దావీదు–నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే 22అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్పఅపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను. 23అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను 24–నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాల నైన నేను చెప్పుమాటలను ఆలకించుము; 25నా యేలినవాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. 26నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయనుద్దేశించు వారును నాబాలువలె ఉందురు గాక. 27అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి 28నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. 29నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్దనున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును. 30యెహోవా నా యేలినవాడవగు నిన్నుగూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత 31నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చుకొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవునుగాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగునన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను. 32అందుకు దావీదు–నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. 33నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. 34నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయినయెడల, నీకు హానిచేయకుండ నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారు లోగా నాబాలునకు మగవాడొకడును విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి 35తనయొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసికొని–నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను. 36అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను. 37ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండెపగిలెను, అతడు రాతివలె బిగిసికొనిపోయెను. 38పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. 39నాబాలు చనిపోయెనని దావీదు విని–యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడుచేయకుండ నన్ను కాపాడి, నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను. 40దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చి–దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడుకొనిరండని పంపెననగా 41ఆమె లేచి సాగిలపడి– నా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి 42త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతోకూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను. 43మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీయైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి. 44సౌలు తన కుమార్తెయైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.
Currently Selected:
1 సమూయేలు 25: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.