YouVersion Logo
Search Icon

1 సమూయేలు 22

22
1దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. 2మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి. 3తరువాత దావీదు అక్కడనుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి –దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలిసికొనువరకు నా తలిదండ్రులు వచ్చి నీయొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవిచేసి 4అతనియొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగియున్న దినములువారు అతనియొద్ద కాపురముండిరి. 5మరియు ప్రవక్తయగు గాదు వచ్చి–కొండలలో ఉండక యూదాదేశమునకు పారి పొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారెతు అడవిలో చొచ్చెను.
6దావీదును అతని జనులును ఫలానిచోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచులవృక్షముక్రింద దిగి యీటె చేతపట్టుకొని యుండెను. అతని సేవకులు అతనిచుట్టు నిలిచియుండగా 7సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను – బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలములను ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? 8మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి నను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే. 9అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండి–యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని. 10అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా 11రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా 12సౌలు–అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు–చిత్తము నా యేలినవాడా అనెను. 13సౌలు–నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా 14అహీమెలెకు–రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? 15అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా 16రాజు–అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి 17యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీదపడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా 18రాజు దోయేగుతో–నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీదపడి ఏఫోదు ధరించుకొనినయెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను. 19మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను. 20అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి 21సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా 22దావీదు–ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందునవాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా. 23నీవు భయపడక నాయొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in