1 సమూయేలు 2
2
1మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను–
నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.
యెహోవాయందు నాకు మహా బలముకలిగెను
నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను
నావిరోధులమీద నేను అతిశయపడుదును.
2యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు
నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు
మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు.
3యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు
ఆయనే క్రియలను పరీక్షించువాడు
ఇకను అంత గర్వముగా మాటలాడకుడి
గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.
4ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు
తొట్రిల్లినవారు బలము ధరించుకొందురు.
5తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికి పోవుదురు
ఆకలిగొనినవారు ఆకలితీర తిందురు
గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును
అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.
6జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే
పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.
7యెహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు
క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.
8దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును
మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును
వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే
లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే.
భూమియొక్క స్తంభములు యెహోవా వశము,
లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
9తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును
దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు
బలముచేత ఎవడును జయము నొందడు.
10యెహోవాతో వాదించువారు నాశనమగుదురు
పరమండలములోనుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును
లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును
తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును
తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
11తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.
12ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి. 13జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునిపనివాడు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి 14బొరుసులోగాని తపేలలోగాని గూనలోగానికుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి. 15ఇదియుగాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో– యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను. 16–ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పినయెడల వాడు–ఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేనియెడల బలవంతముచేత తీసికొందుననును. 17అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.
18బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 19వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుచు వచ్చెను. 20–యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి. 21యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను.
22ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవచేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను 23ఈ జనులముందర మీరు చేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? 24నా కుమారులారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. 25నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవావారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి. 26బాలుడగు సమూయేలు ఇంకను ఎదు గుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.
27అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చి యిట్లనెను –యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. 28అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువు లన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని. 29నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీ రేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులుచేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. 30నీ యింటివారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా– నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. 31ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును. 32యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు. 33నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు. 34నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు. 35తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును. 36అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండిరూకనైనను రొట్టెముక్కనైనను సంపా దించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి–నేను రొట్టెముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు.
Currently Selected:
1 సమూయేలు 2: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.