1 సమూయేలు 15
15
1ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము. 2సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా. 3కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతముచేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను.
4అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి. 5అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి 6–ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలోనుండి వెళ్లిపోయిరి. 7తరువాత సౌలు అమాలేకీయులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి 8అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను 9సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి.
10అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 11–సౌలు నన్ను అనుస రింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను. 12ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను. 13తరువాత అతడు సౌలు నొద్దకురాగా సౌలు–యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా 14సమూయేలు–ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి? అని అడిగెను. 15అందుకు సౌలు–అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి; మిగిలినవాటినన్నిటిని మేము నిర్మూలముచేసితిమనగా 16సమూయేలు–నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు–చెప్పుమనెను. 17అందుకు సమూయేలు– నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను. 18మరియు యెహోవా నిన్ను సాగనంపి–నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగువరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా 19నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. 20అందుకు సౌలు–ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. 21అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను. 22అందుకు సమూయేలు–తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. 23తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా 24సౌలు–జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. 25కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. 26అందుకు సమూయేలు–నీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి 27వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను. 28అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను–నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు. 29మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. 30అందుకు సౌలు–నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతోకూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున 31సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత 32సమూయేలు–అమాలేకీయులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండనిచెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి–మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా 33సమూయేలు–నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను.
34అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను. 35సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదుగాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతు డాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాప పడెను.
Currently Selected:
1 సమూయేలు 15: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.