1 సమూయేలు 10
10
1అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొని– యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను 2–ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు. వారు–నీవు వెదకబోయిన గార్దభములు దొరికినవి, నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. 3తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు. 4వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను. 5ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు; 6యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సువచ్చును. 7దేవుడు నీకు తోడుగానుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము. 8నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధానబలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. 9అతడు సమూయేలునొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను.
10వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారిమధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. 11పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతోకూడనుండి ప్రకటించుట చూచి– కీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా 12ఆ స్థల మందుండు ఒకడు–వారి తండ్రి యెవడని యడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను. 13అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నతస్థలమునకు వచ్చెను.
14సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి–మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు –గార్దభములను వెదకబోతిమి; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు 15సౌలు పిన తండ్రి–సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా 16సౌలు–గార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెనుగాని రాజ్యమునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలు పలేదు.
17తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను 18–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తుదేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములోనుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములోనుండియు విడిపించితిని. 19అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి–మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావ లెను. 20ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. 21బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు. 22కావునవారు–ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను. 23వారు పరుగెత్తిపోయి అక్కడనుండి అతని తోడుకొనివచ్చిరి; అతడు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడుగా కనబడెను. 24అప్పుడు సమూయేలు–జనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచు–రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి.
25తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను. 26సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి. 27పనికిమాలినవారు కొందరు–ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగల డని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను.
Currently Selected:
1 సమూయేలు 10: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.