YouVersion Logo
Search Icon

1 పేతురు 1

1
1యేసుక్రీస్తు#1:1 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి, 2ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
3-4మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన#1:3-4 లేక, జీవముగల. నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. 5కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. 6ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 8-9మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. 10-11మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి. 12పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుప బడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.
13కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. 14-16–నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. 17పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి. 18పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టు నట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని 19అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా 20-21ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియ మింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి. 22-23మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా
24–సర్వశరీరులు గడ్డినిపోలినవారు,వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
గడ్డి ఎండును దాని పువ్వును రాలును,
అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in