1 రాజులు 8
8
1అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధనమందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను. 2కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీ మను ఏడవ మాసమందు పండుగకాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. 3ఇశ్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి 4దాని తీసికొనివచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులును లేవీయులును తీసికొనిరాగా 5రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱెలను ఎడ్లను బలిగా అర్పించిరి. 6మరియు యాజకులు యెహోవా నిబంధనమందసమును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. 7కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. 8వాటి కొనలు గర్భాల యము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడ వుగా ఆ దండెలుంచబడెనుగాని య వి బయటికి కనబడలేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి. 9ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవావారితో నిబంధనచేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను. 10యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. 11కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.
12సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 13నీవు నివాసము చేయుటకు నేను మందిరముకట్టించియున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి 14తన ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని, ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమా జకులందరిని ఈలాగు దీవించెను. 15నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. 16–నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదుగాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను. 17ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా 18యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా–నా నామఘనతకు ఒక మందిరముకట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి యున్నావు, ఆ తాత్పర్యము మంచిదే; 19అయినను నీవు మందిరమును కట్టించకూడదు; నీ నడుములోనుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. 20తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా నియమింపబడి, యెహోవా సెలవుచొప్పున ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడనైయుండి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించియున్నాను. 21అందులో యెహోవా నిబంధనమందసమునకు స్థలమును ఏర్పరచితిని, ఐగుప్తుదేశములోనుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే యున్నది.
22ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి యిట్లనెను 23–యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడును లేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కని కరము చూపుచు ఉండువాడవై యున్నావు, 24నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు. 25యెహోవా ఇశ్రాయేలీయుల దేవా–నీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచినట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూ లుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిర పరచుము. 26ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. 27నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును? 28అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. 29నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లు–నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక. 30మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము. 31ఎవడైనను తన పొరుగువానికి అన్యాయముచేయగా అతనిచేత ప్రమాణము చేయించుటకు అతనిమీద ఒట్టు పెట్టబడినయెడల, అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టు నప్పుడు 32నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతిచొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. 33మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడినప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల 34నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. 35మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగునశ్రమపెట్టుటవలనవారు నీ నామమును ఒప్పు కొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసినయెడల 36నీవు ఆకాశమందు విని, నీ దాసులైన ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. 37దేశమందు క్షామముగాని తెగులుగాని గాడ్పుదెబ్బగాని చిత్తపట్టుటగాని మిడ తలుగాని చీడపురుగుగాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులుగాని వ్యాధిగాని కలిగినను, 38ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరముతట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల 39ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి 40మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు. 41మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశమునుండి వచ్చి 42నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసి ద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరముతట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల 43ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడిన దని తెలిసికొందురు. 44మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరునప్పుడు, నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసినయెడల 45ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారికార్యమును నిర్వహించుము. 46పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టిగాని దగ్గరయైనట్టిగాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు 47వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని–మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల 48తమ్మును చెరగా కొనిపోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీతట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసినయెడల 49ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారికార్యమును నిర్వహించి 50నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధు లైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము. 51వారు ఐగుప్తుదేశములోనుండి ఆ ఇనుపకొలిమిలోనుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునై యున్నారు. 52కాబట్టి నీ దాసుడనైన నేనుచేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులుచేయు విన్నపముమీదను, దృష్టియుంచి, వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపముల నాలకించుము. 53ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోనుండి రప్పించి నప్పుడు నీవు నీ దాసుడైన మోషేద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులంద రిలోనుండి వారిని ప్రత్యేకించితివి గదా.
54సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశముతట్టు తన చేతులను చాపి, యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్లూనుట మాని, లేచి నిలిచిన తరువాత 55అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను. 56ఎట్లనగా –తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు 57కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను, మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి 58తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక. 59ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక. 60అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు. 61కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. 62అంతట రాజును, అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 63ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱెలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. 64ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠము ఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను. 65మరియు ఆ సమయమున సొలొమోనును అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునదివరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి. 66ఎనిమిదవదినమున అతడు జనులకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమతమ గుడారములకు వెళ్లిపోయిరి.
Currently Selected:
1 రాజులు 8: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.