1 రాజులు 6
6
1అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను. 2రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను. 3పరిశుద్ధస్థలము ఎదుట నున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు, మందిరము ముందర అది పది మూరల వెడల్పు. 4అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. 5మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మందిరపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను. 6క్రింది అంతస్తుగది అయిదు మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది ఆరు మూరల వెడల్పు, మూడవ అంతస్తుగదియేడు మూరల వెడల్పు; ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండ మందిరపు గోడచుట్టు బయటితట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను. 7అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు. 8మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను. 9ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను. 10మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టిం చెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.
11అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 12–ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనినయెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను; 13నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.
14ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. 15అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పువరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. 16మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. 17అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను. 18మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు. 19యెహోవా నిబంధనమందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపరచెను. 20గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను. 21ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగారముతో దాని పొదిగించెను. 22ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భా లయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను. 23మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను; 24ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు. 25రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను. 26ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను. 27అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబులు రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను. 28ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. 29మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. 30మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. 31గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవభాగము వెడల్పు ఉండెను. 32రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబులమీదను తమాల వృక్షములమీదను బంగారము పొదిగించెను. 33మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడ ల్పుగా నుండెను. 34రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను. 35వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను. 36మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను. 37నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను; 38పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.
Currently Selected:
1 రాజులు 6: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.