YouVersion Logo
Search Icon

1 రాజులు 3

3
1తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. 2ఆ దినములవరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నతస్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. 3తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెనుగాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను.
4గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను. 5గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా 6సొలొమోను ఈలాగు మనవి చేసెను–నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి, యీ దినమున నున్నట్లుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు. 7నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు; 8నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనులమధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాలదేశమును తనికీ చేయుటయు అసాధ్యము. 9ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము. 10సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక 11దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను–దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. 12నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు. 13మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు. 14మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనినయెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. 15అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందుచేయించెను.
16తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. 17వారిలో ఒకతె యిట్లు మనవి చేసెను–నా యేలినవాడా చిత్తగించుము, –నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితోకూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. 18నేను కనిన మూడవదినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దరమును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు. 19అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను. 20కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. 21ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని. 22అంతలో రెండవ స్త్రీ–అది కాదు; బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె–కాదు, చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజుసముఖమున మనవిచేయగా 23రాజు–బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొకతెయు, రెండవది–ఆలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రదికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది; 24గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా 25రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. 26అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొనిపోయినదై, రాజునొద్ద–నా యేలినవాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ–అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను. 27అందుకు రాజు–బ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. 28అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in