1 రాజులు 12
12
1రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. 2నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తులోనేయుండి ఆ సమాచారము వినెను. 3జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. 4–నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము. 5అందుకు రాజు–మీరు వెళ్లి మూడుదినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి. 6అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్న ప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచనచేసి–ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడుగగా 7వారు–ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. 8అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతోకూడ పెరిగిన యౌవనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను 9–మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? 10అప్పుడు అతనితోకూడ ఎదిగిన ఆ యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి–నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెనుగాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము–నా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును. 11నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. 12–మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవదినమున రెహబాము నొద్దకు వచ్చిరి. 13అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తర మిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను 14–నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెనుగాని నేను మీ కాడిని మరి బరు వుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుగాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. 15జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను. 16కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి– దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి. 17అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను. 18తరువాత రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను. 19ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి. 20మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమాజముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.
21రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలోనుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను. 22అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 23–నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము 24–యెహోవా సెలవిచ్చునదేమనగా–జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.
25తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణముకట్టించి అచ్చట కాపురముండి అచ్చటనుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. 26–ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవామందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానునితట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని 27యరొబాము తన హృదయమందు తలంచి 28ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి–యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; 29ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. 30దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. 31మరియు అతడు ఉన్నతస్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను. 32మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. 33ఈ ప్రకారము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను.
Currently Selected:
1 రాజులు 12: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.