YouVersion Logo
Search Icon

1 కొరింథీయులకు 1:10-17

1 కొరింథీయులకు 1:10-17 TELUBSI

సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు–నేను పౌలు వాడను, ఒకడు–నేను అపొల్లోవాడను, మరియొకడు– నేను కేఫావాడను, ఇంకొకడు–నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యములేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.