YouVersion Logo
Search Icon

1 దినవృత్తాంతములు 28

28
1గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధు లైన పరాక్రమశాలులనందరిని రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. 2అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను–నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధనమందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరముకట్టించ వలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని. 3అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. 4ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునైయుండుటకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు. 5యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసియున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను 6–నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. 7మరియు నేటిదినమున చేయుచున్నట్లు అతడు ధైర్యమువహించి నా ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించినయెడల, నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. 8కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. 9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. 10పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.
11అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును 12వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. 13మరియు యాజకులును లేవీయులును సేవచేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను. 14మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తుప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతని కప్పగించెను. 15బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదెలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదెలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారము గాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక దీపస్తంభమునకును, దాని దాని ప్రమిదెలకును కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను, 16సన్నిధిరొట్టెలు ఉంచు ఒక్కొక బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండిబల్లలకు కావలసినంత వెండిని, 17ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను, 18ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధనమందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతని కప్పగించెను. 19ఇవియన్నియు అప్పగించి–యెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పనియంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. 20మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగా–నీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవనుగూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును. 21దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకారము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పనియంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణు లైనవారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులును జనులందరును నీకు సహాయులగుదురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 1 దినవృత్తాంతములు 28