1 దినవృత్తాంతములు 21
21
1తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా 2దావీదు యోవాబునకును జనులయొక్క అధిపతులకును–మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దానువరకుఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను. 3అందుకు యోవాబు–రాజా నా యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక; వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్షకలుగును అని మనవిచేసెను. 4అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించితిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. 5ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు పదకొండు లక్షలమందియు యూదా వారిలో కత్తిదూయువారు నాలుగు లక్షల డెబ్బదివేలమందియు సంఖ్యకు వచ్చిరి. 6రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్రసంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. 7ఈ కార్యము దేవునిదృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. 8దావీదు–నేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా 9యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము. 10– యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును. 11కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను 12–మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడుదినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవాదూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగ జేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము. 13అందుకు దావీదు–నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. 14కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి. 15యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో–చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లము నొద్ద నిలిచెను. 16దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యాకాశములమధ్యను నిలుచుచు, వరదీసిన కత్తి చేతపట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవాదూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా 17దావీదు– జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపముచేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండకుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను. 18యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవాదూత గాదునకు సెలవియ్యగా 19యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను. 20ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితోకూడనున్న అతని నలుగురు కుమారులును దాగుకొనిరి. 21దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. 22–ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా 23ఒర్నాను–రాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను. 24రాజైన దావీదు–అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి 25ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను. 26పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. 27యెహోవాదూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.
28యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను 29మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. 30దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్లలేకుండెను.
Currently Selected:
1 దినవృత్తాంతములు 21: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.