YouVersion Logo
Search Icon

1 దినవృత్తాంతములు 17

17
1దావీదు తన యింటనుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి–నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధనమందసము తెరలచాటున నున్నదని చెప్పగా 2నాతాను –దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. 3ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 4–నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము–యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయముకట్టించుట నీచేతకాదు. 5ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని. 6నేను ఇశ్రాయేలీయులందరిమధ్యను సంచరించిన కాలమంతయు–మీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైన పలికియుంటినా? 7కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు–నీవు నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱెలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డినుండి తీసికొని 8నీవువెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగ జేయుదును 9మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు; 10నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియుగాక–యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని. 11నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. 12అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను. 13నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడైయుండును; నీకంటె ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. 14నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగానుండునని అతనికి తెలియజేయుము.
15నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాట లన్నిటిని దావీదునకు తెలియజేయగా 16రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను–దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది? 17దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు. 18నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతనుగూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. 19యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు. 20యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు. 21నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి 22నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహోవావైన నీవు వారికి దేవుడవై యున్నావు 23యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. 24ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటి కిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక. 25దేవా –నీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియ జేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. 26యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు. 27ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 1 దినవృత్తాంతములు 17