1 దినవృత్తాంతములు 11
11
1అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చి–చిత్తగించుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము. 2ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివి–నా జనులగు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి. 3ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకురాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూయేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి. 4తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. 5అప్పుడు–నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. 6ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆయాధిపత్యమును పొందెను. 7తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపుర మను పేరు కలిగెను. 8దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను. 9సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.
10ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. 11దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు. 12ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమశాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు. 13ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను. 14వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 15ముప్పదిమంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను. 16దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను. 17దావీదు ఆశపడి–బేత్లెహేమునందలి ఊరి గవినియొద్ద బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా 18ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ద బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి 19–నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. 20యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను. 21ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెనుగాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. 22మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను; మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను. 23అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేతపట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడలాగి దానితో వానిని చంపెను. 24యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను. 25ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెనుగాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకులకధిపతిగా ఉంచెను.
26మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, 27హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, 28తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు, 29హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, 30నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు, 31బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబై కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, 32గాయషులోయవాడైన హూరై, అర్బా తీయుడైన అబీయేలు, 33బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా, 34గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, 35హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, 36మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, 37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, 38నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు, 39అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబుయొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై, 40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, 41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, 42రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది, 43మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు, 44ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీయేలు, 45షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, 46మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, 47ఎలీయేలు ఓబేదు, మెజో బాయా ఊరివాడైన యహశీయేలు.
Currently Selected:
1 దినవృత్తాంతములు 11: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.