యోహాను సువార్త 6

6
అయిదు వేలమందికి భోజనం పెట్టిన యేసు
1ఈ సంగతులు జరిగిన కొంతకాలానికి, యేసు గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తిబెరియ సముద్రతీరానికి వెళ్లారు. 2అక్కడ ఆయన రోగులను స్వస్థపరచడం ద్వారా ఆయన చేసిన అసాధారణ సూచకక్రియలను చూసిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. 3అప్పుడు యేసు కొండ ఎక్కి తన శిష్యులతో పాటు అక్కడ కూర్చుని ఉన్నారు. 4యూదుల పస్కా పండుగ సమీపించింది.
5యేసు గొప్ప జనసమూహం తన దగ్గరకు రావడం చూసి ఫిలిప్పుతో, “ఈ ప్రజలు తినడానికి రొట్టెలను ఎక్కడ కొందాం?” అన్నారు. 6తాను చేయబోయేది ఆయనకు ముందుగానే తెలుసు, కేవలం అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఆయన అడిగారు.
7ఫిలిప్పు ఆయనతో, “ఒక్కొక్కరికి ఒక్కో చిన్నముక్క ఇవ్వడానికి సరిపడే రొట్టెలను కొనాలంటే రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది” అని చెప్పాడు.
8ఆయన శిష్యులలో మరొకడు, సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ మాట్లాడుతూ, 9“ఇక్కడ ఒక బాలుని దగ్గర అయిదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంత మందికి అవి ఎలా సరిపోతాయి?” అన్నాడు.
10అప్పుడు యేసు, “ప్రజలను కూర్చోబెట్టండి” అని చెప్పారు. అక్కడ చాలా పచ్చిక ఉంది కాబట్టి, ప్రజలు కూర్చున్నారు. అక్కడ సుమారు అయిదు వేలమంది పురుషులు ఉన్నారు. 11యేసు ఆ రొట్టెలను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి అక్కడ కూర్చున్న వారికి కావలసినంత పంచిపెట్టారు. చేపలు కూడా అలాగే పంచిపెట్టారు.
12వారందరూ సరిపడినంత తిన్న తర్వాత ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు. 13అందరు తిన్న తర్వాత మిగిలిన అయిదు యవల రొట్టె ముక్కలను పన్నెండు గంపలలో నింపారు.
14యేసు చేసిన అద్భుత కార్యాన్ని చూసిన ప్రజలు, “నిజంగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. 15వారు తనను బలవంతంగా రాజును చేయాలని చూస్తున్నారని యేసు గ్రహించి తప్పించుకుని ఒంటరిగా కొండపైకి వెళ్లారు.
యేసు నీటిపై నడచుట
16సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రతీరానికి వెళ్లి, 17ఒక పడవ ఎక్కి ఆ సరస్సును దాటుతూ కపెర్నహూముకు వెళ్తున్నారు. అప్పటికే చీకటి పడింది కానీ యేసు వారిని ఇంకా చేరుకోలేదు. 18బలమైన గాలి వీస్తూ అలల ఉధృతి పెరిగింది. 19#6:19 లేదా సుమారు 5 లేదా 6 కిలోమీటర్లువారు సుమారు మూడు, నాలుగు మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత, యేసు నీటి మీద నడస్తూ పడవ దగ్గరకు రావడం చూసి వారు భయపడ్డారు. 20అయితే ఆయన వారితో, “నేనే, భయపడకండి” అన్నారు. 21అప్పుడు వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకోడానికి ఒప్పుకున్న వెంటనే ఆ పడవ వారు వెళ్లవలసిన తీరాన్ని చేరింది.
22తర్వాత రోజు సరస్సు అవతలి వైపు ఉన్న జనసమూహం అక్కడ ఒకే ఒక పడవ ఉండడం చూసి యేసు తన శిష్యులతో కలిసి పడవలో ఎక్కి వెళ్లలేదని కేవలం శిష్యులు మాత్రమే వెళ్లారని గ్రహించారు. 23ప్రభువు కృతఙ్ఞతలు చెల్లించిన తర్వాత వారు రొట్టెలు తిన్న ప్రాంతానికి కొన్ని చిన్న పడవలు తిబెరియ నుండి వచ్చాయి. 24ఆ పడవలలో వచ్చిన ఆ జనసమూహం యేసు ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించి మళ్ళీ పడవలు ఎక్కి యేసును వెదుకుతూ కపెర్నహూముకు వెళ్లారు.
పరలోకం నుండి దిగి వచ్చిన రొట్టె
25వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడకు ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు.
26అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెదుకుతున్నారు తప్ప నేను చేసిన అద్భుత కార్యాలను చూసినందుకు కాదని నేను మీతో చెప్పేది నిజము. 27మీరు పాడైపోయే ఆహారం కోసం కష్టపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేశారు” అని చెప్పారు.
28అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు.
29అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.
30కాబట్టి వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్భుత కార్యాన్ని చేస్తున్నావు? ఏమి చేస్తావు? 31మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘తినడానికి వారికి పరలోకం నుండి ఆహారం ఇచ్చారు#6:31 నిర్గమ 16:4; నెహె 9:15; కీర్తన 78:24,25’ అని వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు.
32యేసు వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నా తండ్రే నిజమైన ఆహారం మీకిస్తారు. 33ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
34అందుకు వారు, “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు.
35అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు. 36అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు. 37తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను. 38ఎందుకంటే నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను. 39ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపడం నన్ను పంపినవాని చిత్తమై ఉంది. 40కుమారుని చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందాలనేది నా తండ్రి చిత్తమై ఉంది. వారిని చివరి రోజున జీవంతో నేను లేపుతాను.”
41“పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు. 42వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకున్నారు.
43యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు. 44ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను. 45‘దేవుడు వారందరికి బోధిస్తారు#6:45 యెషయా 54:13’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు. 46దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూశారు 47నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము. 48జీవాహారం నేనే. 49మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు. 50అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు. 51పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.
52అందుకని యూదులు తమలో తాము, “ఈయన తన శరీరాన్ని మనం తినడానికి ఎలా ఇవ్వగలడు?” అని తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు.
53అందుకు యేసు వారితో, “నేను మీతో చెప్పేది నిజం, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు. 54నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవారు నిత్యజీవం కలిగి ఉంటారు. చివరి రోజున నేను వానిని జీవంతో లేపుతాను. 55నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానీయము. 56నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను. 57సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు నేను తండ్రి వలననే జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవారు నా వలన జీవిస్తారు. 58పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు కాని ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు” అని చెప్పారు. 59కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ యేసు ఈ మాటలను చెప్పారు.
యేసును విడిచిపెట్టిన అనేకమంది శిష్యులు
60అది విన్న ఆయన శిష్యులలో అనేకమంది, “ఇది కష్టమైన బోధ, ఎవరు దీనిని అంగీకరిస్తారు?” అన్నారు.
61యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకుంటున్నారని గ్రహించి వారితో, “ఈ మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయా? 62అయితే మనుష్యకుమారుడు తాను ఇంతకుముందు ఉన్న చోటికే ఎక్కిపోవడం చూస్తే ఏమంటారు? 63ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి. 64అయినా మీలో కొందరు నమ్మడం లేదు” అన్నారు. ఎందుకంటే వారిలో ఎవరు మొదటి నుండి నమ్మడం లేదో, ఎవరు తనను అప్పగిస్తారో యేసుకు తెలుసు. 65ఆయన వారితో, “ఈ కారణంగానే తండ్రి రానిస్తేనే తప్ప మరి ఎవరు నా దగ్గరకు రాలేరని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.
66అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనక్కి వెళ్లిపోయి మరి ఎన్నడు ఆయనను వెంబడించలేదు.
67యేసు పన్నెండుమందిని, “మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా?” అని అడిగారు.
68అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి. 69నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మి తెలుసుకున్నాము” అని చెప్పాడు.
70అప్పుడు యేసు, “మీ పన్నెండుమందిని నేను ఎన్నుకోలేదా? అయినా మీలో ఒకడు దుష్టుడు” అని వారితో చెప్పారు. 71పన్నెండుమందిలో ఒకనిగా ఉన్నా తర్వాత ఆయనను అప్పగించబోయే సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి ఆయన చెప్పారు.

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце

Бясплатныя планы чытання і малітвы, звязаныя з యోహాను సువార్త 6

YouVersion выкарыстоўвае файлы cookie для персаналізацыі вашага акаунта. Выкарыстоўваючы наш вэб-сайт, вы згаджаецеся на выкарыстанне намі файлаў cookie, як апісана ў нашай Палітыцы прыватнасці