మార్కు 16

16
1విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములుకొనిరి. 2-3వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా, –సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. 4వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది. 5అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. 6అందు కతడు కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. 7మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. 8వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్పలేదు.
9ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. 10-11ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని, ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి.
12ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారురూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. 13వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.
14పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. 15మరియు–మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. 16నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. 17నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును#16:17 మూలభాషలో–నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును.; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, 18పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
19ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. 20వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన#16:20 మూలభాషలో–వెంబడించుచుండిన. సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.

Цяпер абрана:

మార్కు 16: TELUBSI

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце