ఆదికాండము 23

23
1శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువదియేడు. 2శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెనుగూర్చి యేడ్చుటకును వచ్చెను. 3తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి 4–మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా 5-6హేతు కుమారులు–అయ్యా మా మాట వినుము. నీవు మామధ్యను మహారాజవై యున్నావు; మా శ్మశాన భూములలో అతి శ్రేష్ఠమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహామునకు ఉత్తరమిచ్చిరి. 7అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి 8–మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. 9సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీమధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను. 10అప్పుడు ఎఫ్రోను హేతు కుమారులమధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా 11–అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టు మనెను. 12అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి 13–సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చుకొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను. 14-15అందుకు ఎఫ్రోను–అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును; నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను; 16అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను. 17-18ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నియు, అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. 19ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను. 20ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానముకొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце