ఆది 23
23
శారా మృతి
1శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది. 2ఆమె కనాను దేశంలోని కిర్యత్-అర్బా అనగా హెబ్రోనులో చనిపోయింది, అబ్రాహాము శారా కోసం దుఃఖపడడానికి, ఏడ్వడానికి వెళ్లాడు.
3తర్వాత అబ్రాహాము చనిపోయిన తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి హిత్తీయులతో#23:3 లేదా హేతు సంతతివారు; 5, 7, 10, 16, 18, 20 వచనాల్లో కూడా మాట్లాడుతూ, 4“నేను మీ మధ్య విదేశీయునిగా, అపరిచితునిగా ఉన్నాను. చనిపోయిన నా భార్యను పాతిపెట్టడానికి నాకు కొంత భూమి అమ్మండి” అని అన్నాడు.
5హిత్తీయులు అబ్రాహాముకు జవాబిస్తూ, 6“అయ్యా, మేము చెప్పేది వినండి, మీరు మా మధ్య దేవుని రాజకుమారునిలా ఉన్నారు. సమాధి స్థలాల్లో మీకు నచ్చిన దానిలో మీరు పాతిపెట్టండి. మాలో ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు” అన్నారు.
7అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హిత్తీయుల ఎదుట తలవంచాడు. 8-9వారితో ఇలా అన్నాడు, “మీరు నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడానికి సమ్మతిస్తే, సోహరు కుమారుడైన ఎఫ్రోనుకు చెందిన పొలం చివర మక్పేలా గుహ ఉంది, నా తరపున అతనితో మాట్లాడి, ఆ స్థలం నాకు మీ మధ్యలో ఉండే సమాధి స్థలంగా పూర్తి వెలకు అమ్ముమని అడగండి.”
10హిత్తీయుడైన ఎఫ్రోను అక్కడే తన ప్రజలమధ్య కూర్చుని, పట్టణ గవినికి వచ్చిన హిత్తీయులందరి సమక్షంలో అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు. 11“నా ప్రభువా, అలా కాదు, నా మాట వినండి; ప్రజలందరి సమక్షంలో నేను పొలాన్ని ఇస్తాను, అందులోని గుహను ఇస్తాను. మీరు పాతి పెట్టుకోండి.”
12మళ్ళీ అబ్రాహాము ఆ దేశ ప్రజలందరి ఎదుట తలవంచాడు, 13అతడు ఆ దేశ ప్రజలందరూ వినేలా ఎఫ్రోనుతో, “నా మాట విను, పొలం యొక్క వెల నేను చెల్లిస్తాను. నా భార్య మృతదేహాన్ని అక్కడ నేను పాతిపెట్టేలా నా నుండి అది అంగీకరించు” అన్నాడు.
14-15ఎఫ్రోను అబ్రాహాముకు జవాబిస్తూ, “నా ప్రభువా, మా మాట వినండి; దాని ఖరీదు నాలుగు వందల షెకెళ్ళ#23:14,15 అంటే సుమారు 4.6 కి. గ్రా. లు వెండి, అయితే నాకు మీకు మధ్య అదెంత? మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు.
16అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు.
17మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలం అందులో ఉన్న గుహ ఆ పొలం సరిహద్దులో ఉన్న అన్ని చెట్లు 18పట్టణ గవిని దగ్గర ఉన్న హిత్తీయుల సమక్షంలో అబ్రాహాము పేర దస్తావేజు చేయబడింది. 19అప్పుడు అబ్రాహాము కనాను దేశంలో, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారా మృతదేహాన్ని పాతిపెట్టాడు. 20కాబట్టి ఆ పొలం, అందులోని గుహ, హిత్తీయుల వలన స్మశాన వాటికగా అబ్రాహాము పేరు మీద వ్రాయబడింది.
المحددات الحالية:
ఆది 23: OTSA
تمييز النص
شارك
نسخ

هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.