ఆది 33
33
యాకోబు ఏశావును కలుస్తాడు
1యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు, ఏశావు తన నాలుగువందలమంది మనుష్యులతో వస్తూ కనిపించాడు; కాబట్టి అతడు పిల్లలను లేయాకు రాహేలుకు ఇద్దరు దాసీలకు పంచి అప్పగించాడు. 2అతడు దాసీలు, వారి పిల్లలను ముందు ఉంచి, తర్వాత లేయా తన పిల్లలను, చివరిగా రాహేలును, యోసేపును ఉంచాడు. 3అతడు అందరికంటే ముందు వెళ్తూ, తన సోదరున్ని సమీపించే వరకు ఏడుసార్లు సాష్టాంగపడ్డాడు.
4అయితే ఏశావు యాకోబును కలవడానికి పరుగెత్తి వెళ్లి అతన్ని హత్తుకున్నాడు; తన చేతులు అతని మెడ మీద వేసి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఏడ్చారు. 5ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు.
యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు.
6అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు వచ్చి అతనికి నమస్కారం చేశారు. 7తర్వాత లేయా, ఆమె పిల్లలు వచ్చి నమస్కరించారు. చివరికి యోసేపు, రాహేలు కూడా వచ్చి నమస్కరించారు.
8ఏశావు, “ఈ మందలు, పశువులన్నీ నాకు ఎందుకు?” అని అడిగాడు.
“నా ప్రభువా, నీ దృష్టిలో దయ పొందడానికి” అని యాకోబు అన్నాడు.
9అయితే ఏశావు, “నా తమ్ముడా, నాకిప్పటికే సమృద్ధిగా ఉంది. నీది నీవే ఉంచుకో” అని అన్నాడు.
10యాకోబు ఇలా అన్నాడు, “దయచేసి, వద్దు! నీ దృష్టిలో నేను దయ పొందితే, ఈ బహుమానం అంగీకరించాలి. నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టే ఉంది, దయతో నీవు నన్ను చేర్చుకున్నావు. 11దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను స్వీకరించు, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించారు, నాకు అవసరమైనది నా దగ్గర ఉన్నది.” యాకోబు పట్టుబట్టడంతో ఏశావు దానిని స్వీకరించాడు.
12అప్పుడు ఏశావు, “మనం వెళ్తూ ఉందాము; నేను మీతో వస్తాను” అని అన్నాడు.
13కానీ యాకోబు అతనితో, “నా దగ్గర ఉన్నవి పసిపిల్లలు, గొర్రెలు, మేకలు వాటికి పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వీటిని త్వరపెట్టి తోలితే, పశువులన్నీ చస్తాయి. 14కాబట్టి నా ప్రభువు తన సేవకునికి ముందుగా వెళ్లాలి. నేను శేయీరులో ఉన్న నా ప్రభువు దగ్గరకు వచ్చేవరకు, నా ముందున్న గొర్రెల మందలు పశువుల మందలు, అలాగే ఈ పసిపిల్లలు నడువగలిగిన దానిని బట్టి వాటిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువస్తాను” అని అన్నాడు.
15అందుకు ఏశావు, “అలాగైతే నా మనుష్యుల్లో కొందరిని మీతో ఉంచుతాను” అని అన్నాడు.
“అలా ఎందుకు? నా ప్రభువు దృష్టిలో దయ ఉంటే చాలు” అని యాకోబు అన్నాడు.
16కాబట్టి ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం చేశాడు. 17అయితే యాకోబు మాత్రం సుక్కోతుకు వెళ్లాడు, అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టించుకుని, పశువులకు పాకలు వేశాడు. అందుకే ఆ స్థలం సుక్కోతు#33:17 సుక్కోతు అంటే ఆశ్రయాలు అని పిలువబడింది.
18యాకోబు పద్దనరాము నుండి వచ్చి, క్షేమంగా కనానులో ఉన్న షెకెము పట్టణానికి చేరాడు, ఆ పట్టణం ఎదురుగా గుడారం వేసుకున్నాడు. 19తాను గుడారం వేసుకున్న స్థలాన్ని షెకెము తండ్రియైన హమోరు కుమారుల దగ్గర వంద వెండి నాణేలకు#33:19 హెబ్రీలో కెశితా; దీని ప్రస్తుత విలువ తెలియదు కొన్నాడు. 20అక్కడ అతడు బలిపీఠం కట్టాడు, ఆ స్థలానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు#33:20 ఎల్ ఎలోహి ఇశ్రాయేలు అంటే అర్థం ఎల్ ఇశ్రాయేలు దేవుడు లేదా ఇశ్రాయేలు దేవుడు శక్తిమంతుడు. అని పేరు పెట్టాడు.
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.