ఆది 20
20
అబ్రాహాము అబీమెలెకు
1అబ్రాహాము అక్కడినుండి దక్షిణాదికి ప్రయాణం చేసి కాదేషుకు, షూరుకు మధ్య నివాసం ఉన్నాడు. కొంతకాలం గెరారులో ఉన్నాడు. 2అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి, “ఈమె నా చెల్లెలు” అని చెప్పాడు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన రాజభవనం లోనికి రప్పించుకున్నాడు.
3అయితే ఆ రాత్రి కలలో దేవుడు అబీమెలెకుకు కనిపించి, “నీవు తీసుకున్న స్త్రీ కారణంగా నీవు చచ్చినట్టే ఎందుకంటే ఆమె ఇంకొకని భార్య” అని చెప్పారు.
4అబీమెలెకు ఆమెను సమీపించలేదు. కాబట్టి అతడు, “ప్రభువా, మీరు ఒక నిర్దోషులైన జనాన్ని నాశనం చేస్తారా? 5‘ఆమె నా సోదరి’ అని అతడు చెప్పలేదా? ‘ఇతడు నా అన్న’ అని ఆమె కూడా చెప్పలేదా? నేను నిర్మలమైన మనస్సాక్షితో నిర్దోషిగా ఉండి దీన్ని చేశాను” అని అన్నాడు.
6అప్పుడు దేవుడు అతనితో కలలో ఇలా అన్నారు, “అవును, నీవు నిర్మలమైన మనస్సాక్షితో చేశావని నాకు తెలుసు, అందుకే నీవు పాపం చేయకుండా ఆపాను. అందుకే నీవామెను ముట్టుకోకుండా చేశాను. 7ఇప్పుడు ఆ మనుష్యుని భార్యను తనకు ఇవ్వు, అతడు ప్రవక్త కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే, నీవు, నీకు సంబంధించిన వారందరు చస్తారు.”
8మర్నాడు వేకువజామున అబీమెలెకు తన అధికారులను పిలిపించి, వారితో ఏమి జరిగిందో చెప్పాడు, వారు ఎంతో భయపడ్డారు. 9అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, “నీవు మాకు చేసింది ఏంటి? నీ పట్ల నేను ఏ తప్పు చేశానని ఇంత గొప్ప అపరాధం నాపైన, నా రాజ్యం పైన తెచ్చావు? నీవు నా పట్ల చేసినవి ఎవరు చేయకూడనివి” అని అన్నాడు. 10అబీమెలెకు, “నీవు ఇలా చేయడానికి కారణమేంటి?” అని అబ్రాహామును అడిగాడు.
11అందుకు అబ్రాహాము అన్నాడు, “ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను. 12అంతేకాదు, ఆమె నిజంగా నా సోదరి, నా తండ్రికి కుమార్తె కాని నా తల్లికి కాదు; ఆమె నా భార్య అయ్యింది. 13దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తిరిగేలా చేసినప్పుడు, నేను ఆమెతో ఇలా చెప్పాను, ‘మనం వెళ్లే ప్రతిచోటా నా గురించి, “ఈయన నా సోదరుడు” అని చెప్పు, ఇది నా పట్ల నీ ప్రేమ.’ ”
14అప్పుడు అబీమెలెకు గొర్రెలను, పశువులను, దాసదాసీలను అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాము భార్యయైన శారాను కూడా తిరిగి అప్పగించాడు. 15అబీమెలెకు, “నా దేశం నీ ఎదుట ఉన్నది; నీకు ఇష్టమైన చోట నీవు నివసించవచ్చు” అన్నాడు.
16అతడు శారాతో, “నీ అన్నకు వెయ్యి షెకెళ్ళ#20:16 అంటే, సుమారు 12 కి. గ్రా. లు వెండి ఇస్తున్నాను, ఇది నీతో ఉన్న వారందరి ఎదుట నీకు విరోధంగా చేసిన దానికి నష్టపరిహారం; నీవు పూర్తిగా నిర్దోషివి” అన్నాడు.
17అప్పుడు అబ్రాహాము దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అబీమెలెకును, అతని భార్య, అతని ఆడ దాసీలను స్వస్థపరచగా వారు తిరిగి పిల్లలు కన్నారు. 18ఎందుకంటే యెహోవా అబ్రాహాము భార్య శారాను బట్టి అబీమెలెకు ఇంట్లోని స్త్రీలందరిని పిల్లలు కనలేకుండా చేశారు.
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.