የYouVersion አርማ
የፍለጋ አዶ

లూకా 16

16
1మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఒక. ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా 2అతడు వాని పిలిపించి– నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను. 3ఆ గృహనిర్వాహకుడు తనలో తాను–నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. 4నన్ను ఈ గృహనిర్వాహ కత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని, 5తన యజమానుని ఋణస్థులలో ఒక్కొక్కని పిలిపించి–నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను. 6వాడు– నూరు మణుగుల నూనె అని చెప్పగా–నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను. 7తరువాత వాడు–నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు– నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో–నీవు నీ చీటి తీసికొనియెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను. 8అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె#16:8 మూలభాషలో–వెలుగు కుమారులకంటె. ఈ లోక సంబంధులు#16:8 మూలభాషలో–ఈ యుగపు కుమారులు. తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు. 9అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. 10మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. 11కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? 12మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? 13ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను.
14ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా 15ఆయన–మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవునిదృష్టికి అసహ్యము. 16యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు 17ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. 18తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు.
19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. 20లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి 21అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. 23అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి 24–తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. 25అందుకు అబ్రాహాము – కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. 26అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. 27అప్పుడతడు–తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. 28వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. 29అందుకు అబ్రాహాము–వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా 30అతడు–తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. 31అందుకతడు–మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.

Currently Selected:

లూకా 16: TELUBSI

ማድመቅ

Share

Copy

None

ያደመቋቸው ምንባቦች በሁሉም መሣሪያዎችዎ ላይ እንዲቀመጡ ይፈልጋሉ? ይመዝገቡ ወይም ይግቡ