ఆది 45

45
యోసేపు తనను తాను తెలియజేసుకోవడం
1అప్పుడు యోసేపు తన సేవకులందరి ఎదుట తనను తాను అదుపు చేసుకోలేక, “అందరిని నా ఎదుట నుండి పంపివేయండి!” అని బిగ్గరగా చెప్పాడు. తన సోదరులకు తనను తాను తెలియపరచుకున్నప్పుడు యోసేపుతో ఎవరు లేరు. 2అతడు ఈజిప్టువారు వినేటంతగా బిగ్గరగా ఏడ్చాడు, ఫరో ఇంటివారు దాని గురించి విన్నారు.
3యోసేపు తన సోదరులతో, “నేను యోసేపును! నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా?” అని అన్నాడు. అతన్ని చూసి అతని సోదరులు కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.
4యోసేపు తన సోదరులతో, “నా దగ్గరకు రండి” అన్నాడు. వారు అతని దగ్గరకు వచ్చాక, “నేను మీ సోదరుడైన యోసేపును, మీరు ఈజిప్టుకు అమ్మివేసినవాన్ని! 5ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు. 6ఇప్పటికి దేశంలో కరువు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, ఇంకా వచ్చే అయిదు సంవత్సరాలు దున్నడం, కోత కోయడం ఉండదు. 7అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు.
8“కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు. 9ఇప్పుడు నా తండ్రి దగ్గరకు వెంటనే వెళ్లి అతనితో, ‘నీ కుమారుడైన యోసేపు ఇలా అన్నాడు: దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద ప్రభువుగా చేశారు. నా దగ్గరకు వచ్చేయండి; ఆలస్యం చేయకండి! 10మీరు, మీ పిల్లలు, మీ మనవళ్లు, మీ మందలు, మీ పశువులు, మీతో ఉన్న సమస్తం గోషేను ప్రాంతంలో నాకు సమీపంగా ఉండవచ్చు. 11ఇంకా రాబోయే అయిదు సంవత్సరాలు కరువు ఉంటుంది అయితే అక్కడ మిమ్మల్ని నేను పోషిస్తాను. లేకపోతే మీకు మీ ఇంటివారికి పేదరికం ఏర్పడుతుంది.’
12“మాట్లాడుతుంది నిజంగా నేనే అని స్వయంగా మీరు, నా తమ్ముడైన బెన్యామీను చూడవచ్చు. 13ఈజిప్టులో నాకు ఇవ్వబడిన ఘనత గురించి, మీరు చూసిన ప్రతి దాని గురించి నా తండ్రికి చెప్పండి. నా తండ్రిని ఇక్కడకు త్వరగా తీసుకురండి” అని చెప్పాడు.
14తర్వాత తన సోదరుడైన బెన్యామీనుపై మెడ మీద చేతులు వేసి, ఏడ్చాడు, బెన్యామీను అతన్ని హత్తుకుని ఏడ్చాడు. 15తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. తర్వాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
16ఫరో ఇంటివారికి యోసేపు సోదరులు వచ్చారని సమాచారం చేరినప్పుడు, ఫరో, అతని అధికారులందరు సంతోషించారు. 17ఫరో యోసేపుతో, “మీ సోదరులతో, ‘మీరు ఇలా చేయండి: మీ జంతువులను ఎక్కించి, కనాను దేశానికి తిరిగివెళ్లి, 18మీ తండ్రిని మీ కుటుంబాలను తీసుకురండి. ఈజిప్టు దేశంలో శ్రేష్ఠమైన నేలను మీకిస్తాను. మీరు శ్రేష్ఠమైన ఆహారం తినవచ్చు’ అని చెప్పు.
19“ఇలా కూడ చెప్పమని ఆదేశిస్తున్నాను, ‘మీరు ఇలా చేయండి: మీ పిల్లలు, మీ భార్యల కోసం ఈజిప్టు నుండి కొన్ని బండ్లను తీసుకెళ్లండి, మీ తండ్రిని తీసుకురండి. 20అక్కడ మీ సామాన్ల గురించి చింతించకండి ఎందుకంటే ఈజిప్టులో శ్రేష్ఠమైనవన్నీ మీవి.’ ”
21కాబట్టి ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో ఆజ్ఞమేరకు వారికి బండ్లను ఇచ్చాడు, ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. 22అతడు వారందరికి క్రొత్త బట్టలు ఇచ్చాడు, కాని బెన్యామీనుకు మూడువందల షెకెళ్ళ#45:22 అంటే సుమారు 3.5 కి. గ్రా. లు వెండి, అయిదు జతల బట్టలు ఇచ్చాడు. 23తన తండ్రికి పంపించింది ఇది: పది గాడిదల మీద ఈజిప్టులో నుండి శ్రేష్ఠమైన వస్తువులు, పది ఆడగాడిదలు మీద ధాన్యం, ఆహారం, తన ప్రయాణానికి కావలసిన ఇతర సామాగ్రి. 24తర్వాత తన సోదరులను పంపిస్తూ, వారు వెళ్లేటప్పుడు, “మీలో మీరు గొడవపడకండి!” అని చెప్పాడు.
25కాబట్టి వారు ఈజిప్టు నుండి వెళ్లారు, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చారు. 26వారు అతనితో, “యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు! నిజానికి, అతడు ఈజిప్టు అంతటికి పాలకుడు” అని చెప్పారు. అది విని యాకోబు ఆశ్చర్యపోయాడు; అతడు వారి మాటను నమ్మలేదు. 27అయితే యోసేపు తమతో చెప్పిందంతా వారు అతనికి చెప్పి, యోసేపు తనను తీసుకెళ్లడానికి పంపిన బండ్లను చూసినప్పుడు, తమ తండ్రియైన యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. 28అప్పుడు ఇశ్రాయేలు, “నాకిది చాలు, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను చనిపోకముందు వెళ్లి అతన్ని చూస్తాను” అని అన్నాడు.

Okuqokiwe okwamanje:

ఆది 45: OTSA

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume