రోమా 8:1-17
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యెుక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.
రోమా 8:1-17