ఫిలిప్పీయులకు 4:4-13
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై యుండును. నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
ఫిలిప్పీయులకు 4:4-13