మార్కు 1:1-20
దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. –ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు. మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మముపొందెను. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు–నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు –కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
మార్కు 1:1-20