మార్కు 1:1-11
దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. –ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు. మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మముపొందెను. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు–నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మార్కు 1:1-11