మత్తయి 6:25-34
అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి– ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
మత్తయి 6:25-34