లూకా 6:27-38
వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా–మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవువానియొద్ద దాని మరల అడుగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
లూకా 6:27-38