యోహాను 19:30-42

యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును. –అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది. అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందునవారు అందులో యేసును పెట్టిరి.
యోహాను 19:30-42