గలతీయులకు 5:1-15
ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతిమనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు. ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నే నింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. ధర్మశాస్త్ర మంతయు– నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచు కొనుడి.
గలతీయులకు 5:1-15