విశ్రాంతి లేని వారికి విశ్రాంతినమూనా
ఆత్మీయ పాఠము
మూడవ రోజు: ప్రతి దిన సమస్యలనుండి సేదదీరుట
మనందరుము అనేక భారాలను మోస్తూవుంటాము. ఒకరు అనారోగ్యము అనే భారమును మొస్తూవుంటే మరికొందరు పని భారము అనే దానిని మొస్తూవుంటారు. కొంతమంది పిల్లలైతే కఠినమైన పాఠములను చదువుట అనే భారాన్ని భరిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులైత్తే పిల్లలని సరిగా పెంచటము అనే ఒత్తిడిని అనుభవిస్తుంటారు. కొందరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మరికొందరు భావోద్రేకమైన వత్తిడిని ఆందోళనను అనుభవిస్తుంటారు. బైబిలు గ్రంథము స్పష్టముగా తెలియజేసేదేమంటే ఈ లోకములో మనమందరము అనేక సమస్యలగుండా వెళ్ళక తప్పదు. నిజముగా చెప్పాలంటే “లోకములో మీకు శ్రమ కలుగును“ అని యేసు ప్రభువు వారే చెప్పుచున్నారు (యోహాను 16:33). అదే విధముగా పేతురు తమ పాఠకులతో చెప్పుచున్నదేమంటే, “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగు చున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి” (1 పేతురు 4:12).
యోబు మనకు జ్ఙాపకము చేసేదేమంటే, “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” (యోబు 14:1). దినిలో మనమందరమూ ఉన్నాము. పౌలు భక్తుడు కొరింధీయులను హెచ్చరిస్తూ ఈ విధముగా చెప్పెను, “ఈ గుడారములోనున్న సమయములొ మనము భారము మోసికొని మూల్గు చున్నాము “ (2 కొరింథి 5:4). మనము ఈ భువి మీద ఎన్ని రోజులైతే జీవిస్తామో అన్ని రోజులు మనము అనేక భారములను మోస్తూవుండవలసిందే. కాని ఒక శుభ వార్త ఉన్నది! యేసు మత్తయి 11:28 లో ఇస్తున్న వాగ్ధానము మన అనుదిన సమస్యలకు కూడా వర్తిస్తుంది. మనము ఈ భువిపై అనేక భారములను మోస్తూ కృంగి ఉండగా యేసు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తారు. అందుచేతనే అపోస్తలుడైన పేతురు “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి “ అని మనలను ప్రోత్చహిస్తున్నాడు (1 పేతురు 5:7). మనము మన భారములను మోయవలసిన అవసరము ఇక లేదు ఎందుకంటే మన భారములన్నియు ఆయన మీద వేసుకోడానికి యేసు ఇష్టపడుతున్నాడు. మనము మన చింతలన్ని ఆయనమీద వేసినప్పుడు ఆయన మనకు శ్రమల మధ్యలో కూడా ఓ గొప్ప శాంతిని అనుగ్రహిస్తాడు (యోహాను 16:33; ఫిలిప్పి 4:6-7). యేసు నొద్దకు వచ్చుటలో విశ్రాంతి ఉన్నది. ఆయన దేనినైనా వాగ్ధానాన్ని చేసారంటే దానిని తప్పక నెరవేరుస్తారు.
ఈ రోజు యేసు నొద్దకు రండి, విశ్రాంతి పొందండి. పాపములో, ఆస్తులలో విశ్రాంతి లేదు, పేరుప్రతిష్టలలో, ప్రజలలో, మధ్యపానములో, మత్తు ధ్రవ్యములలో విశ్రాంతి దొరకదు. నిజమైన విశ్రాంతి యేసులోనే దొరుకుతుంది! ఈ లొకములో కొన్ని కొట్ల మంది ప్రజలు యేసు ఇచ్చే విశ్రాంతిని పొందుకున్నారు. మీరు కూడా మీ జీవితములోని అనుదిన శ్రమలనుండి విడుదలై తద్వారా విశ్రాంతి పొందుకొనగలరు.
ఈ ప్రణాళిక గురించి
ఈ ఆత్మీయ పాఠములు దేవుని అన్వేశించు వారికి క్రీస్తును కనుగొనుటకు, విశ్వాసులైన వారికి కలిగే కష్టనష్టములలో క్రీస్తుయందు విశ్రాంతి పొందుకొనుటకు సహాయపడుతుంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు డాక్టర్ డేవిడ్ మెండే గారికి మరియు ఎల్-షద్ధాయ్ అసెంబ్లీ అఫ్ గాడ్ చర్చి కి మేము ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి వారి వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://elshaddaiag.in/