రూతు 3:1-5
రూతు 3:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత రూతుతో నయోమి ఇలా చెప్పింది. “అమ్మా, నువ్వు స్థిరపడేలా ఏదైనా ఏర్పాటు చెయ్యాలి కదా. నీకు క్షేమం చేకూరేలా నేను చూడాలి. ఎవరి పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. విను, ఈ రాత్రి అతడు తన పొలంలో బార్లీ గింజలు తూర్పారబట్టబోతున్నాడు. నువ్వు స్నానం చేసి సువాసన నూనె రాసుకుని బట్టలు మార్చుకుని ఆ పొలానికి ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళు. అతని భోజనం ముగించి నిద్రపోయేంత వరకూ అతనికి కనిపించవద్దు. నిద్రపోయిన తరువాత ఎక్కడ పడుకున్నాడో చూడు. ఆ చోటికి నువ్వూ వెళ్ళగలిగేలా దాన్ని గుర్తు పెట్టుకో. తరువాత అక్కడికి వెళ్ళి అతని కాళ్ళపై ఉన్న దుప్పటి తీసి అక్కడ పడుకో. ఆ తరువాత జరగాల్సిందంతా అతనే చెబుతాడు.” అప్పుడు రూతు “నువ్వు చెప్పినట్టే చేస్తాను” అంది.
రూతు 3:1-5 పవిత్ర బైబిల్ (TERV)
రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుంటుందేమో, అది నీకు క్షేమం. (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. ఈ రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు. నీవు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు. అతడు భోజనము చేసిన తర్వాత పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి గూర్చి) అతనే నీకు చెప్తాడు.” “నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
రూతు 3:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆమె అత్తయైన నయోమి–నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు. నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి
రూతు 3:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక రోజు రూతు అత్తయైన నయోమి, “నా కుమారీ, నేను నీకోసం ఒక ఇంటిని వెదకాలి, అక్కడ నీకు మంచి జరుగుతుంది. నీవు ఎవరి పనికత్తెలతో పని చేస్తున్నావో, ఆ బోయజు మనకు బంధువు. ఈ రాత్రి అతడు నూర్పిడి కళ్ళంలో యవలు చెరిగిస్తూ ఉంటాడు. నీవు స్నానం చేసి నూనె రాసుకుని మంచి బట్టలు కట్టుకుని ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లు. అతడు భోజనం చేసే వరకు నీవు అక్కడ ఉన్నావని అతనికి తెలియనీయకు. అతడు పడుకున్నప్పుడు అతడు పడుకున్న స్థలం గమనించు. తర్వాత లోపలికి వెళ్లి, అతని కాళ్లమీద ఉన్న బట్ట తీసి పడుకో. నీవు ఏం చేయాలో అతడు నీకు చెప్తాడు” అని చెప్పింది. అందుకు రూతు, “నీవు చెప్పింది నేను చేస్తాను” అని జవాబిచ్చింది.