రూతు 1:15-17
రూతు 1:15-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు నయోమి “చూడు, నీ తోడికోడలు తిరిగి తన ప్రజల దగ్గరికీ తన దేవుళ్ళ దగ్గరికీ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ తోడికోడలి వెంటే వెళ్ళు” అని రూతుతో చెప్పింది. అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.
రూతు 1:15-17 పవిత్ర బైబిల్ (TERV)
నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.” కానీ రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్తాను. నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే నావారు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చస్తే నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేది మనలను విడదీయ లేదు.”
రూతు 1:15-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆమె–ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను. అందుకు రూతు–నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.
రూతు 1:15-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నయోమి రూతుతో, “చూడు, నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరకు, తన దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్తుంది. నీవు తనతో వెళ్లు” అన్నది. అందుకు రూతు, “నిన్ను విడవమని లేదా తిరిగి వెళ్లిపొమ్మని నన్ను బలవంతం చేయకు. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను విడదీస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక.”