రోమా 8:31-34
రోమా 8:31-34 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఈ విషయాలకు ప్రతిస్పందనగా మనం ఏం చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపుంటే, మనకు విరోధంగా ఎవరుండగలరు? దేవుడు తన సొంత కుమారుని విడిచిపెట్టలేదు, మనందరి కొరకు ఆయనను వదులుకున్నాడు, అలాంటప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలడు? దేవుడు ఏర్పరచుకొన్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే గదా! అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మనకొరకు దేవుని వేడుకొనే యేసు క్రీస్తు తప్ప మరి ఎవరూ కాదు.
రోమా 8:31-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.
రోమా 8:31-34 పవిత్ర బైబిల్ (TERV)
మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు.
రోమా 8:31-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే
రోమా 8:31-34 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు? దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు? దేవుడు ఏర్పరచుకున్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా! అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మన కోసం దేవుని వేడుకొనే యేసు క్రీస్తే తప్ప మరి ఎవరూ కాదు.