రోమా 8:18-28

రోమా 8:18-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది. సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ. నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు? అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు.

షేర్ చేయి
చదువండి రోమా 8

రోమా 8:18-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము. అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు. దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

షేర్ చేయి
చదువండి రోమా 8

రోమా 8:18-28 పవిత్ర బైబిల్ (TERV)

మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది. సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు. దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు.

షేర్ చేయి
చదువండి రోమా 8

రోమా 8:18-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. అటువలె ఆత్మ యు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనముచేయుచున్నాడు. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

షేర్ చేయి
చదువండి రోమా 8

రోమా 8:18-28

రోమా 8:18-28 TELUBSIరోమా 8:18-28 TELUBSIరోమా 8:18-28 TELUBSIరోమా 8:18-28 TELUBSI