రోమా 8:1-27
రోమా 8:1-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు, ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని అనుగ్రహించే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది. శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయడానికి శక్తిహీనంగా ఉండిందో, దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారార్థ బలిగా ఉండడానికి తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు, శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతినియమాలు నెరవేరబడాలని ఇలా జరిగింది. శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది. శరీరంచే పాలించబడే మనస్సు మరణము, కాని ఆత్మచే పాలించబడే మనస్సు జీవం మరియు సమాధానమై ఉన్నది. శరీరంచే పాలించబడే మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు. శరీరం యొక్క యేలుబడిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు. అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కనుక శరీరం యొక్క యేలుబడిలో ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు, క్రీస్తుకు చెందినవారు కారు. క్రీస్తు మీలో ఉన్నట్లైతే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది. యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన, నాశనమయ్యే మీ శరీరాలకు కూడా జీవాన్ని ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, మనకు ఒక బాధ్యత ఉంది, మనం దాని ప్రకారం జీవించాలి, కాని అది శరీరానుసారమైనది కాదు. మీరు శరీరానుసారంగా జీవిస్తే, మీరు మరణిస్తారు, కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే, మీరు బ్రతుకుతారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు, అప్పుడు ఆయన ద్వారా మనం “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం అవుతాము అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందేలా ఆయన శ్రమల్లో మనం పాలుపంచుకొంటే క్రీస్తుతో సహ వారసులం అవుతాము. మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. సృష్టి నిరాశకు గురైనది, అది తన ఇష్ట ప్రకారం కాదు గాని అప్పగించినవాని చిత్తప్రకారం, నిరీక్షణ కలిగినదై అప్పగించబడింది. సృష్టి నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ. నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కొరకు ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. అప్పటికే కలిగివున్న వాటికొరకు ఎవరు నిరీక్షిస్తారు? అయితే మన దగ్గర లేని దాని కొరకు మనం నిరీక్షిస్తే, మనం ఓపికగా ఎదురుచూడగలము. అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మనకొరకు ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కొరకు దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు.
రోమా 8:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు. క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు. శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు. క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది. చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు. దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం. మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము. అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
రోమా 8:1-27 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము. ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు. దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు. అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు. దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “ అబ్బా ! తండ్రీ!” అని పిలుస్తున్నాము మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి. మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది. సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.
రోమా 8:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యెుక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. అటువలె ఆత్మ యు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనముచేయుచున్నాడు.
రోమా 8:1-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది. శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారబలిగా తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతి నియమాలను నెరవేర్చడానికి ఇలా జరిగింది. శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు. శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు. క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది. యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన నాశనమయ్యే మీ శరీరాలకు కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వగలరు. కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు మరణిస్తారు. కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే మీరు బ్రతుకుతారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తు సహ వారసులమవుతాం. మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది. సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ. నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు? అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు.