రోమా 6:16-22
రోమా 6:16-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీ రెరుగరా? మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతనుబట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే, అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
రోమా 6:16-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా ఉండడానికి అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారు అని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేక నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికి, మీకు బోధించిన మాదిరికి మీరు హృదయమంతటితో లోబడ్డారు, కనుక అది ఇప్పుడు మీ విధేయతగా చెప్పబడుతుంది కనుక దేవునికి వందనాలు. మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు. మానవులుగా మీకున్న పరిమితులను బట్టి అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు మిమ్మల్ని మీరు అపవిత్రతకు, ఎప్పడూ పెరుగుతుండే దుష్టత్వానికి ఎలా దాసులుగా అప్పగించుకొన్నారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత వైపుకు నడిపించే నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి యొక్క అధికారం నుండి మీరు స్వతంత్రులు అవుతారు. మీరు ఇప్పుడు సిగ్గుపడునట్లుగా ఉన్న గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల మీకు కలిగిన ప్రయోజనమేమిటి? ఆ పనుల ఫలం మరణమే గదా! అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులు అయ్యారు, దాని వలన మీకు కలుగు ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.
రోమా 6:16-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు. మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి. మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం. అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం.
రోమా 6:16-22 పవిత్ర బైబిల్ (TERV)
సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు. ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు. మీకు వీటిని అర్థం చేసుకొనే శక్తి లేదు కనుక నేను మాములు ఉదాహరణలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవిత్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా అర్పించుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా అర్పించుకోండి. మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు. ఆ పనుల వల్ల మీరు ఏమి ఫలం పొందారు? వాటివల్ల మరణమే కలుగుతుంది. ఇక ఇప్పుడు మీరు పాపంనుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది.
రోమా 6:16-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేదా నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికీ, ఏ ఉపదేశానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి మీరు హృదయమంతటితో లోబడ్డారు. కాబట్టి దేవునికి వందనాలు. మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు. మీ శరీర బలహీనతలను బట్టి అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు మరింత దుష్టత్వంలోనికి నడిపించే అపవిత్రతకు, దుష్టత్వానికి మిమ్మల్ని మీరు ఎలా దాసులుగా అప్పగించుకున్నారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత వైపుకు నడిపించే నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు. గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి? వాటివలన మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా! ఆ పనుల ఫలం మరణమే! అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులయ్యారు. దాని వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.