రోమా 6:12-18

రోమా 6:12-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

కనుక మీ శరీర దుష్ట ఆశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. దుష్టత్వాన్ని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి ఇవ్వవద్దు, కాని మరణం నుండి జీవంలోనికి తీసుకొనిరాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించండి. మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు గాని, కృప కలిగివున్నారు కనుక ఇక మీదట పాపం మీ మీద అధికారాన్ని కలిగివుండదు. అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగివున్నాం కనుక మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా ఉండడానికి అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారు అని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేక నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికి, మీకు బోధించిన మాదిరికి మీరు హృదయమంతటితో లోబడ్డారు, కనుక అది ఇప్పుడు మీ విధేయతగా చెప్పబడుతుంది కనుక దేవునికి వందనాలు. మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.

షేర్ చేయి
Read రోమా 6

రోమా 6:12-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు. అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

షేర్ చేయి
Read రోమా 6

రోమా 6:12-18 పవిత్ర బైబిల్ (TERV)

నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు. అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు. ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు.

షేర్ చేయి
Read రోమా 6

రోమా 6:12-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికినికూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీ రెరుగరా? మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

షేర్ చేయి
Read రోమా 6

రోమా 6:12-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కాబట్టి మీ శరీర దురాశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. దుష్టత్వానికి పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి అప్పగించవద్దు. అయితే మరణం నుండి జీవంలోనికి తీసుకురాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించాలి. మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు కాని, కృప కలిగి ఉన్నారు కాబట్టి ఇకమీదట పాపం మీమీద అధికారాన్ని కలిగి ఉండదు. అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేదా నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికీ, ఏ ఉపదేశానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి మీరు హృదయమంతటితో లోబడ్డారు. కాబట్టి దేవునికి వందనాలు. మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.

షేర్ చేయి
Read రోమా 6