రోమా 6:1-16
రోమా 6:1-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? ఎన్నడు అలా చెప్పకూడదు, పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం? లేదా క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా? తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతోపాటు పాతిపెట్టబడ్డాము. మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతోపాటు ఏకమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఏకమవుతాము. మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించునట్లు, మన పాత స్వభావం ఆయనతోపాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు. ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. కనుక మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతోపాటు మనం కూడా జీవిస్తూ ఉంటామని మనం నమ్ముతున్నాము. క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; మరణం ఎన్నడు ఆయనపై యేలుబడి చేయదు. ఆయన మనందరి పాపాల కొరకు మరణించారు, ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు. అలాగే, పాప విషయంలో చనిపోయాం కాని యేసుక్రీస్తులో దేవుని కొరకు సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి. కనుక మీ శరీర దుష్ట ఆశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. దుష్టత్వాన్ని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి ఇవ్వవద్దు, కాని మరణం నుండి జీవంలోనికి తీసుకొనిరాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించండి. మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు గాని, కృప కలిగివున్నారు కనుక ఇక మీదట పాపం మీ మీద అధికారాన్ని కలిగివుండదు. అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగివున్నాం కనుక మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా ఉండడానికి అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారు అని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేక నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా?
రోమా 6:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం? క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా? తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు. ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు. అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా?
రోమా 6:1-16 పవిత్ర బైబిల్ (TERV)
దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము? బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం. మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు. మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి. నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు. అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు.
రోమా 6:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము. చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు. మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలె మీరును పాపము విష యమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికినికూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీ రెరుగరా?
రోమా 6:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? ఎన్నడు అలా చెప్పకూడదు. పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం? క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా? తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము. మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము. మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా, మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు. ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; ఇకపై మరణానికి ఆయన మీద అధికారం లేదు. ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు. అలాగే పాప విషయంలో చనిపోయాం కాని యేసు క్రీస్తులో దేవుని కోసం సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి. కాబట్టి మీ శరీర దురాశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. దుష్టత్వానికి పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి అప్పగించవద్దు. అయితే మరణం నుండి జీవంలోనికి తీసుకురాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించాలి. మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు కాని, కృప కలిగి ఉన్నారు కాబట్టి ఇకమీదట పాపం మీమీద అధికారాన్ని కలిగి ఉండదు. అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేదా నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా?