రోమా 3:9-20

రోమా 3:9-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము. దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పి చెడిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారు నాలుకలతో మోసం చేస్తారు.” “వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.” “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి, సమాధాన మార్గం వారికి తెలియదు.” “వారి కళ్లలో దేవుని భయం లేదు.” ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము.

షేర్ చేయి
చదువండి రోమా 3

రోమా 3:9-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు. అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది. వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి. వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి. వారికి శాంతిమార్గం తెలియదు. వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.” ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

షేర్ చేయి
చదువండి రోమా 3

రోమా 3:9-20 పవిత్ర బైబిల్ (TERV)

మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు! అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు. అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!” “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.” “వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!” “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!” “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి. వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!” “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.” ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.

షేర్ చేయి
చదువండి రోమా 3

రోమా 3:9-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

షేర్ చేయి
చదువండి రోమా 3