రోమా 3:1-31
రోమా 3:1-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి? ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి. వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.” అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మనమీద చూపితే ఆయన అన్యాయస్థులు అవుతారా? నేను మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు? అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం వలన దేవుని సత్యం వ్యాపించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు. “మంచి జరగడానికి చెడు చేద్దాం” అని మేము చెప్తున్నామని కొందరు దూషిస్తున్నట్లుగా మేమెందుకు చెప్పకూడదు? అలాంటి వారికి వచ్చే శిక్ష న్యాయమైనదే! అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము. దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పి చెడిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారు నాలుకలతో మోసం చేస్తారు.” “వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.” “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి, సమాధాన మార్గం వారికి తెలియదు.” “వారి కళ్లలో దేవుని భయం లేదు.” ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దానిని గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు. అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు. ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు. అయితే అతిశయించడానికి కారణం ఎక్కడ? అది రద్దు చేయబడింది. ఏ నియమాన్ని బట్టి? క్రియల నియమాన్ని బట్టియా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టియే. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా విశ్వాసం ద్వారానే ఒకరు నీతిమంతునిగా తీర్చబడతారని మనం నిశ్చయించుకున్నాము. దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే. దేవుడు ఒక్కడే కాబట్టి సున్నతి పొందినవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేనివారిని కూడా అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతారు. అయితే ఈ విశ్వాసం బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ఎన్నటికి కాదు! మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.
రోమా 3:1-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి. కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే. మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను. అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు? మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే. అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు. అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది. వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి. వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి. వారికి శాంతిమార్గం తెలియదు. వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.” ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు. కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే. కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము. దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే. దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.
రోమా 3:1-31 పవిత్ర బైబిల్ (TERV)
సున్నతి పొందినవాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువౌతుంది. నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!” మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు? “నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది. మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు! అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు. అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!” “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.” “వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!” “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!” “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి. వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!” “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.” ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు. అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం. మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు. మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కానివాళ్ళకు కూడా దేవుడే. దేవుడు సున్నతి పొందినవాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందనివాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.
రోమా 3:1-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినయెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; అట్లనరాదు. అట్లయినయెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల? మేలు కలుగుటకు కీడుచేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయబడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టివేయ బడెను? క్రియాన్యాయమునుబట్టియా? కాదు, విశ్వాస న్యాయమునుబట్టియే. కాగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలులేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము.
రోమా 3:1-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)