రోమా 14:13-23
రోమా 14:13-23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మానేద్దాం. దానికి బదులు, సహోదరి లేదా సహోదరుని మార్గంలో ఆటంకంగా ఉండకుండా మీ మనస్సును సిద్ధపరచుకోండి. యేసు ప్రభువులో అంగీకరించబడిన వాటిలో అపవిత్రమైనది ఏదీ లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాని ఎవరైనా ఒక దానిని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే. నీవు తినే దానిని బట్టి నీ సహోదరి లేదా సహోదరుడు దుఃఖపడితే, నీవు ప్రేమ చూపడం లేదన్నట్టు. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని నీవు తినే దానిని బట్టి నాశనం చేయకు. కనుక నీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. దేవుని రాజ్యం తిని త్రాగే వాటికి సంబంధించింది కాదు గాని, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందానికి సంబంధించింది. కాబట్టి ఇలా క్రీస్తుకు సేవ చేసేవారు దేవుని సంతోషపరుస్తారు, మానవుల అంగీకారాన్ని పొందుతారు. కాబట్టి ఏది మనల్ని సమాధానం వైపు, పరస్పర వృద్ధి వైపుకు నడిపిస్తుందో దాన్ని మనం చేద్దాం. ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని మరొకరికి ఆటంకాన్ని కలిగించేది తినేవానికి అది తప్పవుతుంది. మాంసం తినకపోవడం గాని మద్యం త్రాగకపోవడం గాని మీ సహోదరులు లేక సహోదరీలు పడిపోయేలా చేసే ఏదైనా చేయకపోవడమే మంచిది. వీటి గురించి మీకు గల నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి శిక్ష పొందనివారు దీవించబడినవారు. అయితే సందేహంతో తినేవారు విశ్వాసం కలిగి తినలేదు కనుక శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిది పాపమే అవుతుంది.
రోమా 14:13-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం. సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది. నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు. మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి. దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం. ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం. ఆహారం కోసం దేవుని పని పాడు చేయవద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ ఎవరైనా తాను తిన్న దాని మూలంగా ఇతరులకు తొట్రుపాటు కలిగిస్తే అది కీడు. మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దాన్ని మానివేయడం మంచిది. ఈ విషయాల్లో నీ నమ్మకాలను నీకు, దేవునికి మధ్యనే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనపై తాను నిందారోపణ చేసుకోని వ్యక్తి ధన్యుడు. అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.
రోమా 14:13-23 పవిత్ర బైబిల్ (TERV)
కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి. ఏ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కానీ ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమౌతుంది. నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు. నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు. అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం. ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర్ల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం. నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటంలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం. అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు. సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకొన్నవి.
రోమా 14:13-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డైమెనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించు కొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తినినయెడల విశ్వాసములేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
రోమా 14:13-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మాని సహోదరి లేదా సహోదరుని మార్గానికి ఆటంకం కలిగించము అని తీర్మానం చేసుకుందాం. సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని యేసు ప్రభువులో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే ఎవరైనా ఒకదాన్ని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే. మీరు తినే దాన్ని బట్టి మీ సహోదరి గాని సహోదరుడు గాని బాధపడితే, మీలో ప్రేమ లేదన్నట్టే. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని మీరు తినే దాన్ని బట్టి పాడు చేయకు. కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు. కాబట్టి మనకు సమాధానాన్ని, పరస్పర వృద్ధిని కలిగించే దానినే మనం చేద్దాం. ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని ఒకరు తినేది మరొకరికి ఆటంకాన్ని కలిగిస్తే అది తప్పవుతుంది. మాంసం తినడం గాని మద్యం త్రాగడం గాని లేదా మరేదైనా మీ సహోదరులకు సహోదరీలకు ఆటంకంగా ఉంటే అది చేయకపోవడమే మంచిది. వీటి గురించి మీకున్న నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి తనకు తాను తీర్పు తీర్చుకొననివారు దీవించబడినవారు. అయితే సందేహంతో తినేవారు విశ్వాసం లేకుండా తింటారు కాబట్టి శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ పాపమే అవుతుంది.